Bharat Summit 2025 : గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని తెలిపారు. రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని రాహుల్ సూచించారు. దేశ సమస్యలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించాను.. మొదలుపెట్టాక వెనకడుగు వేయలేదని వివరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర మొదలు పెట్టాక చాలా మంది నాతో కలిసి నడవటం మొదలుపెట్టారన్నారు. పాదయాత్రలో జనం సమస్యలు వినటం నేర్చుకున్నానని, ఇప్పుడు వారి సమస్యలు వినటంలో నాయకులు విఫలమయ్యారని రాహుల్ గాంధీ వివరించారు. నిన్ననే భారత్ సమ్మిట్‌లో పాల్గొనాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని తెలిపారు. పాతతరం నాయకత్వం అంతరించిపోయిందని, రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. కొత్త తరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని సూచించారు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి, యువ నేతలను తయారు చేయాలని రాహుల్ గాంధీ తెలిపారు.