Telangana Cabinet Expansion Soon : త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరణ జరగనుంది. సోమవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతోపాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘'భారత్ సంవిధాన్'అంతర్జాతీయ సదస్సు’పైనా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. భారత సంవిధాన్ సమావేశాలకు సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. ఆరుగురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేసి, రెండు ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందున, ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్నట్లు తెలిసింది.