Russells Viper Snakelets Rescued : ఒకటి, రెండు పాములు చూస్తేనే భయంగా ఉంటుంది. అలాంటిది ఏకాంగా ఒకేచోట దాదాపు 40 పాము పిల్లలు కనిపించాయి. వీటిని వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ రక్షించింది. అనంతరం సమీప అటవీ ప్రాంతంలో వాటిని వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్స్.కర్ణాటక తుమకూరు జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి బ్లాక్ నివాసి శివన్న టైర్స్ యజమాని కార్తిక్ షెడ్లో 4 అడుగుల రస్సెల్ వైపర్(రక్త పింజర)తో పాటు దాని 43 పిల్లలు కనిపించాయి. దీంతో భయపడి పోయిన కార్తిక్ వైల్డ్‌లైఫ్ అవేర్నెస్ అండ్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఆర్గనైజేషన్‌కు చెందిన చందన్, మను అగ్నివంశి, కార్తిక్ సింగ్ పాములను రక్షించారు. అంతరం వాటిని సమీపంలోని దేవరాయణ దుర్గ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.ఈ పాములు నవంబర్, డిసెంబర్‌లలో జతకట్టి వర్షాకాలం ముందు జన్మనిస్తాయి. ఓవోవివిపరస్ పాములలో, గుడ్లు తల్లి శరీరం లోపల అభివృద్ధి చెందుతాయి. వాటిని గర్భంలోనే పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి ఈ పాములు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాముల సంరక్షులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాత్రి వేళల్లో టార్చ్‌ను ఉపయోగించాలని, ధరించే ముందు బూట్లను తనిఖీ చేయాలని చెప్పారు.