SLBC Tunnel Rescue Operation Updates : ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల వెలుపల మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో మట్టి,రాళ్లు, బురదను తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్లోకి పంపారు. మరో రెండు రోబోలను ఆపరేషన్స్‌లో వినియోగించనున్నారు. అనుమానిత ప్రాంతాలైన డీ-2 పరిధిని పెంచి చుట్టుపక్కల తవ్వకాలు జరిపినా మనుషుల జాడ కనిపించలేదు. డీ-2, డీ-1 మధ్య 12 మీటర్ల పొడవున్న ప్రాంతంలో అన్నిరకాల శిథిలాలు, శకలాలు తొలగిస్తే గల్లంతైనవారి జాడ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దుర్వాసన సంకేతాలు అందుతున్నా ఎక్కడ నుంచి వస్తుందో తెలియక నిరంతర శోధన సాగుతోంది.