Tribes Facing Problems To Cross Stream at Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కోసంగి పరిధిలోని గ్రామాల ప్రజలు వర్షాలు వస్తే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డుంబ్రిగుడ సమీపంలోని పెద కోసంగి, కోసంగి గ్రామాల మధ్యలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షం కాస్త తెరిపివ్వడంతో నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు గిరిజనులు సాహసమే చేయాల్సి వస్తుంది. పీకల్లోతు ప్రవాహంలో గెడ్డను దాటుకుంటూ మండల కేంద్రానికి వెళ్లి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.మన్యంలో విడవకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. అత్యవసర పరిస్థితుల్లో వాగులు దాటేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు, ఎర్రబొమ్మలు పంచాయతీల్లో ఎర్రవరం, ఎర్నాపల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల గిరిజనులు గ్రామం వదిలి బయటకు రావాలంటే మధ్యలో కొండవాగులు దాటాలి. ఇక్కడ కల్వర్టులు లేకపోవడంతో వాగులు దాటేందుకు గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.