12 Tons of Rotten Meat Found in Hyderabad : తక్కువ ధరకు తిన్నంత బిర్యానీ. బోర్డ్ చూడగానే బంపర్ ఆఫర్ అని లాగించేస్తున్నారా! పెళ్లి విందులో మేక తలమాంసం కూర అదిరిందని ఎక్కువగా తింటున్నారా! వారెవ్వా ఏమి రుచి అని ఆశపడితే ఆసుపత్రి పాలవటం గ్యారంటీ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు మాంసం దుకాణ నిర్వాహకులు అతి తక్కువ ధరకు మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. దాన్ని నగరానికి తీసుకొచ్చి నెలల తరబడి ఫ్రిజ్లో నిల్వ చేసి హోటళ్లు, కేటరింగ్ నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి రవాణా : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల ఆట కట్టించేందుకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందాలు వరుస దాడులు చేపట్టాయి. వారం రోజుల వ్యవధిలో సుమారు 20 టన్నుల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 10 మందిపై కేసులు నమోదు చేశారు. నగరం, శివారు ప్రాంతాల్లో 50కి పైగా మాంసం నిల్వ చేస్తున్న స్థావరాలున్నట్టు గుర్తించారు. వీటిపై కూడా రెండు మూడ్రోజుల్లో తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నాలుగైదేళ్లుగా నిర్వాహకులు వేలాది టన్నుల మాంసం దిగుమతి చేసుకొని ఏపీ, తెలంగాణ, ముంబయి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు.