Telangana Budget Session Governor Speech : రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం నిలిచిందని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. వరి రైతులకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని అన్నారు. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ముందుగా అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్‌కు శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని, మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.