Government Focused on EX MLA kethireddy Land irregularities : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సాగించిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన భూములను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నోటీసుల్లో వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె.సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దారు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తంగా 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.