BRS MLA Harish Rao Meet HYDRA Victims : సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మూసీపై అఖిలపక్ష సమావేశం తర్వాత ముందుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన మూసీ ప్రాంత బాధితులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, మూసీపై అఖిలపక్షం సమావేశం తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బందిపెట్టలేదని గుర్తు చేశారు. హైడ్రా తన ఇంటిని కూల్చుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యేనని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన సీఎంకు లేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారంటూ ప్రశ్నించారు. అందుకే బాధితులకు రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లీగల్ బృందం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.