CM Revanth Reddy On Dharani Portal : రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 'భూ భారతి' బిల్లుపై అసెంబ్లీలో చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారన్నారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని సీఎం అన్నారు.
భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమురయ్య లాంటివారు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారన్నారు. పేదల భూములను రక్షించేందుకే పటేల్ పట్వారీ వ్యవస్థను గతంలో రద్దు చేశారన్నారు. భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.