Massive Frauds at Petrol Stations in Joint Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల్లో ఘరానా మోసం వెలుగుచూసింది. మూడు పెట్రోల్ బంకుల్లో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు కొలతల్లో మార్పులు చేసి వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు నిగ్గు తేల్చారు. రెండు జిల్లాల్లో పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నప్పటికీ, విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో మూడు చోట్ల మాత్రమే నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల మోసం వెలుగు చూసింది. అత్యధికంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరిగే బంకుల్లో ఏటా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొలతలు తక్కువగా ఇస్తూ రెండు నుంచి ఐదు కోట్లరూపాయల వరకు ఆర్జిస్తున్నట్లు తేలింది. అనంతపురం శివారులోని సోమలదొడ్డి వద్ద పెట్రోల్ బంకులో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఏటా 2.80 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ తక్కువగా పోస్తూ 2.70 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తేల్చారు.