Meerpet Murder Case Update : కొట్టిన దెబ్బలకు భార్య మరణం, ఆ విషయం అత్తారింట్లో తెలిస్తే ఎలా స్పందిస్తారోనని అనుమానం, పోలీసు కేసు భయం. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి భార్య మృతదేహాన్ని మాయం చేయాలని అనుకున్నాడు. సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను హత్య చేసిన గురుమూర్తి, మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్లో రెండు గంటలు వెతికాడు. గతంలో చూసిన వెబ్ సిరీస్ల ప్రేరణతో భార్య మృతదేహాన్ని 3 ముక్కలు చేసి సాయంత్రానికి మాయం చేశాడు.
రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో కలకలం రేపిన వెంకటమాధవి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సైనిక ఉద్యోగి, భర్త గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్లో వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం గురుమూర్తి, వెంకటమాధవి మధ్య గొడవ జరిగినట్లు గుర్తించారు. తలను గోడకు గట్టిగా కొట్టగా ఆమె మరణించింది. మాధవి మరణంతో గురుమూర్తి ఆలోచనలో పడ్డాడు.