Government Approves Rs.85,083 Cr Investments In AP : రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కూటమి ప్రభుత్వం తొలి ముద్ర వేసింది. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులతో మొదటి అడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB)తొలి సమావేశం ఇందుకు వేదికైంది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ.85,083 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 33,966 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సహకాలు అందిస్తుంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.