Finance Minister Payyavula Keshav Response Budget : ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో గత 5 ఏళ్లు అనుభవంలోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్టును ప్రవేశపెట్టలేనంతగా గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో దేశంలోని ఆర్థిక అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్సుగా మారిందని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు. దిల్లీలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసే స్థితికి దిగజార్చారని ఆయన విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో శరవేగంగా అభివృద్ధి బాటలో సాగుతున్న రాష్ట్రం 2019 ఎన్నికల అనంతరం పాలకులు తీసుకున్న నిర్ణయాలతో పతనం వైపునకు పయనంగా మారిందని శాసనసభలో బడ్డెట్పై చర్చకు సమాధానంగా మంత్రి పయ్యావులకేశవ్ ఈ వ్యాఖ్యాలు చేశారు.