CM Revanth Laid Foundation Stone to Skill University : గత పాలకులు మూడు నగరాలు నిర్మించారని, ఈ ప్రభుత్వం నాలుగో సిటీని నిర్మించనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామని వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా నిర్మించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరి మండలంలోని నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
యువతకు నైపుణ్యం లేకపోవడం వల్లే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నైపుణ్యమున్న యువతను తీర్చిదిద్దేందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రెడ్డి ల్యాబ్స్ నుంచి ఎస్బీఐ వరకు ఎన్నో సంస్థలు ఈ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. అడ్మిషన్ దొరికితే ఉద్యోగం గ్యారంటీ అని రాష్ట్ర యువతకు హామీ ఇచ్చారు. 57 ఎకరాల్లో సుమారు రూ.150 కోట్లతో స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.