Deputy Mayor by Election in Tirupati : తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నిక కీలక మలుపులు తిరుగుతోంది. ఈనెల 3న ఎస్వీయూ సెనెట్ హాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలో విజయం కోసం కూటమి పార్టీలు, పట్టు నిలుపుకొనేందుకు వైఎస్సార్సీపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విజయానికి అవసరమైన సంఖ్యా బలం ఉండటంతో తమ విజయం ఖాయమన్న ధీమా వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకొనేందుకు తిరుపతి మినహా రాష్ట్రంలో మరెక్కడా వైఎస్సార్సీపీకి అనువైన వాతావరణం లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు తిరుపతిపై దృష్టి సారించారు. సాధారణ ఎన్నికల సమయం నుంచి రెబల్స్ బెడద ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీకి డిప్యూటీ మేయర్ ఎన్నికపైనా ఆ ప్రభావం పడనుంది.