Officials Seize Six Dangerous Lizards In Visakhapatnam Airport : ప్రమాదకరబల్లుల్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను విశాఖ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. మూడు నీలిరంగు నాలుక బల్లులు, మరో మూడు వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 23న రాత్రి బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి విశాఖ వస్తున్న ఇద్దరు ప్రయాణీకుల సామానులలో ఇవి ఉన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. పరిశీలించగా కేక్ ప్యాకెట్లలో దాచి ఉంచిన ఆరు సజీవ విదేశీ బల్లులు కనిపించాయి. అనంతరం వీటిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా అన్యదేశాల అటవీ జంతువుల అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.