Minister Nara Lokesh Unveiled Statue of NTR in Atlanta of America : రెడ్ బుక్లో ఇప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుడునే అన్న లోకేశ్, యవగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులు గురి చేశారని తెలిపారు. అమెరికాలోని అట్లాంటాలో పర్యటించిన మంత్రి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అట్లాంటా NTR ట్రస్టు ఆధ్వర్యంలో 14 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా విగ్రహంపై అభిమానులు పూలు చల్లారు. తెలుగు నేలకు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది ఎన్టీఆరేనని తెలిపారు. ఆయన ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేశారని లోకేశ్ కొనియాడారు. NTR ఆశయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.