Nigerian Drug Gangs Exploiting Loopholes In law : దేశంలో ఏళ్ల తరబడి డ్రగ్స్ దందాను సాగిస్తున్న నైజీరియన్ ముఠాలు, ఇప్పుడు సరికొత్త పద్ధతులతో వ్యాపారం చేస్తున్నారు. భారతీయ చట్టంలోని లొసుగులను నిందితులు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి పోలీసులకు పట్టుబడితే చట్టప్రకారం దేశంలోనే ఉండిపోయేందుకు పన్నాగం పన్నుతున్నట్లు టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు.
నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్‌కు వచ్చి గోవాను డ్రగ్స్ దందాకు అడ్డాగా చేసుకున్నాడు. వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు అతడు వేసిన ఎత్తుగడ పోలీసు అధికారులను నివ్వెరపోయేలా చేసింది. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉండటంతో పోలీసులతో తనపై తానే కేసు నమోదు చేయించుకొని, గోవాలోని కోల్వలే జైలుకెళ్లాడు. దాదాపు 6 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన స్టాన్లీ కేసు విచారణ పూర్తయ్యే వరకు చట్టప్రకారం భారత్‌లోనే ఉండే పరిస్థితిని సృష్టించుకున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఇక్కడితో ఆగకుండా, దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్‌కు చెందిన ఉషాచండేల్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. డీజే స్వదేశ్, వికాస్, దివాకర్ బాబూసో వంటి స్థానిక డ్రగ్ సరఫరాదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని గోవా, హైదరాబాద్‌లో దందాను విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది.