CM Revanth Reddy on Operation Sindoor : పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా దిల్లీ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తక్షణమే హైదరాబాద్ రావాల్సిందిగా సూచించారు. భట్టి విక్రమార్క హైదరాబాద్ రాగానే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.