Kidney Racket Case Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. తాజాగా రాచకొండ పోలీసులకు ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన లింకు దొరికింది. విశాఖలో ఇదే కేసు వ్యవహారం బయటపడడంతో జైలుకెళ్లొచ్చిన డాక్టర్ రాజశేఖర్, పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్‌లో అక్రమ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా తెలుస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చెన్నైలో రాజశేఖర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్‌నగర్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు.
2023వ సంవత్సరం విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు కొందరు రూటు మార్చి హైదరాబాద్ కేంద్రంగా దందా చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్ అరెస్టుతో ఇది రూఢీ అయ్యింది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ రాజశేఖర్ అరెస్టై జైలుకెళ్లినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. విశాఖలో పాత కేసు నేపథ్యంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌లో దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడ్ని చెన్నైలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్‌నగర్ పోలీసులు, సోమవారం రిమాండ్‌కు తరలించారు.