Lions On Railway Track At Gujarat : రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన సింహాన్ని ఓ ఫారెస్ట్ గార్డ్ ఆవును తరిమినట్లు ఓ చిన్న కర్రతో కిందకు పంపించాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ రైల్వే డివిజన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. లిలియా రైల్వే స్టేషన్ గేటు దగ్గర ఫారెస్ట్ గార్డు సింహాన్ని ఆవులా వెంబడించి కర్రతో దాన్ని పక్కకు పంపించేశాడు. ఈ ఘటనపై లిభియా రైల్వే స్టేషన్ గేట్మెన్ స్పందించారు. తాను గత రెండేళ్లుగా రైల్వే శాఖలో పనిచేస్తున్నానని, చాలా సార్లు సింహం గొంతు వినిపించిందని తెలిపారు. కానీ సింహం కనిపించలేదని పేర్కొన్నారు. జనవరి 6న మధ్యాహ్నం 3 గంటలకు అటవీశాఖ ఉద్యోగి వచ్చి ట్రాక్ పై ఉన్న సింహాన్ని బయటకు పంపించారని అన్నారు.పిపావావ్ పోర్ట్, లిలియా మోటా స్టేషన్ మధ్య సింహాలు రైల్వే ట్రాకులు దాటుతుంటాయని రైల్వే పీఆర్వో శంభూజీ తెలిపారు. "సింహం కనిపించినప్పుడు అటవీ శాఖ ఉద్యోగి రెడ్ లైట్ వేసి రైలు ఆపమని పైలట్‌ను సూచించారు. దీంతో లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌ను వేసి రైలును ఆపేశారు. ఆ తర్వాత సింహాన్ని ఫారెస్ట్ గార్డు రైల్వే ట్రాక్ పై నుంచి పంపిన తర్వాత రైలు మళ్లీ బయలుదేరింది." అని శంభూజీ పేర్కొన్నారు.