Villagers Looted Oil Viral Video : ఉత్తర్‌ప్రదేశ్‌లో నూనె ట్యాంకర్ బోల్తా పడగా, స్థానికులు ఆయిల్ తీసుకోవడానికి డబ్బాలు, బకెట్లతో ఘటానాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామస్థులను తరిమికొట్టారు. ఘటనలో గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, అమేఠీ జిల్లాలోని కామరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి- లఖ్‌నవూ హైవేపై మంగళవారం ఉదయం ఘటన జరిగింది. సుల్తాన్‌పుర్ నుంచి లఖ్‌నవూకు నూనెను తీసుకెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్లో ఉన్న నూనె కోసం గ్రామస్థులు ఎగబడ్డారు. అయితే ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే డ్రైవర్‌ను కాపాడడానికి ఎవరు సహాయం చేయకపోయినా, పడిపోయిన ఆయిల్‌ను తీసుకెళ్లాడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారట. ట్యాంకర్ బోల్తా పడిన సమీపంలో బురదమయమైన రహదారిపై గ్రామస్థులు వారి డబ్బాలల్లో పడిపోయిన నూనెను నింపుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ బహదూర్పుర్ హైదర్‌గఢ్ ప్రాంతానికి చెందిన రామ్ మిలన్ కుమారుడు రామ్రాజ్గా పోలీసులు గుర్తించారు.