• 7 years ago
పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఓ గురువు తన వక్రబుద్ధితో కటకటాలపాలైన ఘటనం అనంతపురంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సంజీవరాయుడు బీఈడీ వరకు చదువుకున్నాడు.
మూడేళ్ల కిందట అనంతపురం వచ్చిన సంజీవరాయుడు.. మారుతినగర్‌లో 'లోటస్‌ అకాడమీ కోచింగ్‌' ఏర్పాటు చేసి వివిధ పోటీ పరీక్షలతో పాటు పాలిసెట్, ఏపీఆర్‌జేసీ, టీటీసీ, మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సబ్జెక్టును బట్టి నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాడు.
ఇల్లు, కోచింగ్‌ సెంటర్‌తోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల కోసం హాస్టల్‌ కూడా ఒకే చోట నిర్వహిస్తున్నాడు సంజీవరాయుడు. ప్రస్తుతం అతని అకాడమీలో 75 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది అమ్మాయిలే ఉన్నారు. కాగా, విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్న మంచి ఆలోచనతో అకాడమీ పెట్టిన సంజీవరాయుడి బుద్ధి వక్రమార్గంలో వెళ్లింది.
హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలను నగ్న దృశ్యాలను చిత్రీకరించాలన్న దురాలోచన అతనిలో కలిగింది. ఈ క్రమంలో హాస్టల్‌లో విద్యార్థిను లందరికీ ఒకే బాత్‌రూం ఉండటంతో అవసరమైతే తన బాత్‌రూం కూడా వాడుకోవాలని శుక్రవారం ఉదయం చెప్పాడు. అయితే అప్పటికే తన బాత్‌రూంలో చెప్పుల బాక్సు (ఖాళీ అట్టపెట్టె) ఉంచి, దానికి రంధ్రం పెట్టి అక్కడ సెల్‌ఫోన్‌ వీడియో ఆన్‌ చేసి ఉంచాడు.
కాగా, స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని ఆ అట్టపెట్టె అనుమానంగా కనిపించడంతో తెరిచి చూసింది. వీడియో రికార్డింగ్‌ను గుర్తించింది. జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు తెలియజేసి, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు.. సంజీవరాయుడును చితకబాదారు.

Category

🗞
News

Recommended