CM Revanth Meets Satya Nadella : రాష్ట్రంలో సాంకేతిక రంగం, వనరుల అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో, ఛైర్మన్ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రణాళికలను సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి వివరించారు.
హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణంలో 4వేల మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించడం, త్వరలో చందనవెల్లి, మేకగూడ, షాద్ నగర్ లో నాలుగు డేటా సెంటర్లను 600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనుండటంపై సత్య నాదెళ్లకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసమైన సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏఐ సదస్సులో మైక్రోసాఫ్ట్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ పూర్తయినట్లు ముఖ్యమంత్రి వివరించారు.