Loan App Recovery Agents Arrest : ఈఎంఐ(EMI) డబ్బులు కట్టలేదని ఓ యువతి న్యూడ్ ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్ చేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది. అంతకుముందు యువతి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లోన్ డబ్బులు చెల్లించలేదని దుర్భాషలాడారని పోలీసులు తెలిపారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తోంది. ఆరు నెలల కిందట ఆమె ఫినబుల్ అనే లోన్ యాప్‌లో ఈఎంఐ పద్ధతిలో లోన్ తీసుకుంది. సమయానికి ఆమె ఈఎంఐ చెల్లించలేదు. దీంతో డబ్బులు చెల్లించకపోతే యువతి ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు ఆమెను బెదిరించారు. అంతే కాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులను కూడా ఫోన్ చేసి డబ్బులు కట్టలేదని నోటికి వచ్చినట్లు దూషించారు.