Telangana Congress New PCC Chief Selection : పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం రోజంతా దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెంది ప్రచార కమిటీ సభ్యుడు మధుయాస్కీ గౌడ్, ప్రస్తుత కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చింది.
ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రిగా దామోదర రాజనర్సింహ ఉండడంతో పీసీసీ చీఫ్ ఆ సామాజిక వర్గానికి దక్కే అవకాశం లేదని సమాచారం. ఎంపీ బలరామ్ నాయక్ ఎంపీగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏ మేరకు అవకాశం ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం.