Wood Temple in Adilabad District : అదో మారుమూల అటవీ ప్రాంతం. అక్కడివారంతా ఆదివాసీలే. సహజంగానైతే ఆగ్రామంతో ఎవరికీ సంబంధం ఉండదు. బాహ్యప్రపంచానికి దూరంగా జీవిస్తుంటారు. అడవే ఆలంబనగా బ్రతికే ఆదివాసీలు అక్కడ లభించే కలపతో మహంకాళీ అమ్మవారికి అద్భుతమైన దివ్యమందిరం నిర్మించారు.
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు ఆదివాసీల పుట్టిళ్లులాంటిది. సిరికొండ మండలం వాయిపేట ఆదివాసీ గూడానికి శతాబ్ధాల చరిత్ర ఉంది. అక్కడున్న ఆదివాసీలంతా మహాంకాళి ఆరాధకులు. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా వ్యవసాయమే జీవనాధారంగా సాగే ఆ గ్రామంలో గతంలో చిన్న పూరీ గుడిసెలో మహాంకాళి మందిరం ఉండేది. పదేళ్లక్రితం పశుపతినాథ్ ఆలయ దర్శనంకోసం నేపాల్ వెళ్లిన ఆగ్రామానికి చెందిన కినక శంభూని కర్రతో చేసిన ఆలయం ఆకట్టుకుంది.
ఆయనలో కలిగిన ఆలోచనతో వాయిపేటలో కలపతో చేసిన మహాంకాళి ఆలయం రూపుదిద్దుకుంది. ఎంతో నైపుణ్యంతో మలిచిన 26 పిల్లర్లు, పైకప్పుడు, ఆలయ శిఖరం, అబ్బురపర్చే గర్భగుడి ఇలా ప్రతీది ఆకట్టుకుంటుంది. కలపచెక్కల గోడలతో ఈ మందిరం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇలా అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తోంది.