Paramparagat Krishi Vikas Yojana : దేశంలో వ్యవసాయ యాంత్రీకరణతో ఖర్చు, శ్రమ తగ్గిందని సంతోషిస్తుండగానే మరోవైపు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం విచక్షణారహితంగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోకి వచ్చినప్పటికీ రసాయనాలు వాడకం మాత్రం తగ్గడం లేదు. ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో చాలా మంది రైతులు విష రసాయనాలు విచ్చలవిడిగా వాడడంతో తీరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తోంది. రసాయన అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులు తిని ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద చేయూత అందిస్తుండగా దీన్ని తెలుగు రాష్ట్రాలు క్రమంగా అందిపుచ్చుకుంటున్నాయి.