Vakka industrty In Satya sai District: ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే అరుదుగా సాగుచేసే వక్క తోటలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఉంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న మడకశిర నియోజకవర్గంలో మూడు మండలాల్లో వక్క సాగు పెద్దఎత్తున జరుగుతోంది. దశాబ్దాల కాలంలో అక్కడి రైతులు వక్క సాగుచేస్తూ పంట దిగుబడిని కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. వక్క తోటలకు అనుబంధంగా విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు, రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చాలా కాలంగా అక్కడి రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు మడకశిర పర్యటనకు వచ్చినపుడు వక్క సాగుచేస్తున్న ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తామని, ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరాపురుంలో వక్క ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ భూమి కేటాయింపు కోసం తహసీల్దార్ జిల్లా అధికారులకు నివేదిక పంపించారు.