Bhu Bharathi Bill : శాసనసభలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యల పరిష్కృతం కోసం ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. బిల్లును ప్రవేశపెడుతూ, ఈరోజు చరిత్రాత్మక, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే రోజన్నారు. భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుందని, గ్రామాల్లో భూమి ప్రధాన జీవనాధారం అని మంత్రి పేర్కొన్నారు. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని వివరించారు. 1971లో తెచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు మనుగడలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని అన్నారు. ఇందిరమ్మను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని తెలిపారు. గతంలో తెచ్చిన ధరణి పోర్టల్‌తో కొత్త సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.