Muthyalamma Temple Vandalism Case Update : సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అమ్మవారి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్ నచ్చజెప్పిన ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఆందోళనకారుల్లో కొందరి తలలకు గాయాలయ్యాయి. మరికొంతమందికి శరీర భాగాల్లో గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ దుర్గా అనే యువకుడు నేలపై కూలబడ్డాడు.