SLBC Tunnel Collapse Update : శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికి అందులో చిక్కుకున్న వారి జాడ దొరక్కపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుక్కునేందుకు సొరంగ మార్గంలోని ప్రతికూల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా మారాయి. 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం జరగ్గా అక్కడకు చేరుకునేందుకు సహాయక బృందాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 13 కిలోమీటర్ల వరకూ లోకో ట్రైన్ ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉంది. 11 కిలోమీటర్ల వరకూ లోకోట్రైన్లో వెళ్లి, అక్కడ్నుంచి నీరుండటంతో కన్వేయర్ బెల్టు పైనుంచి గతంలో రాకపోకలు సాగించారు. ప్రస్తుతం అక్కడ కన్వేయర్ బెల్టు తెగిపోయింది. అందుకే 13 కిలోమీటర్ వరకూ నీటిలోనే లోకో ట్రైన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.