Mumbai Family Wear 25 Kg Gold to Tirumala Video Viral : శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వెళతారు. భక్తులతో తిరుమల కొండలు ఎప్పుడూ కిలకిల ధ్వనులతో అలరాడుతుంటాయి. ఆ భక్తులు తెచ్చిన ముడుపులను వెంకటేశ్వరునికి సమర్పిస్తుంటారు. నిత్యం ధనరాశులతో తూగే శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ బంగారు ఫ్యామిలీ తిరుమలకు వెళ్లింది. ముంబయికి చెందిన ఆ కుటుంబం సుమారు 25 కేజీల బరువుంటే బంగారు ఆభరణాలను ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం బయటకు ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు. వారిలో ఇద్దరు 10 కేజీల చొప్పున బంగారాన్ని ధరించగా, మరొకరు 5 కేజీల బంగారాన్ని అలకరించుకున్నారు. ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.15 కోట్లగా ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారి దర్శనానికి రావడంతో తిరుమల గిరులపై దర్శనానికి వెళ్లిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారిని ఆసక్తిగా తిలకించారు. ఇంత బంగారమా అంటూ తీక్షణంగా చూశారు. ఆలయం ఎదుట ఉన్న భక్తులు వారిని చూసి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.