Jayashankar Bhupalpally Flood News : చినుకు పడితే వణికిపోతున్నారు. నాలుగు రోజులు వర్షం కురిసినా పక్కన ఉన్న వాగులు కాస్త పొంగినా వారంతా ఉలిక్కిపడుతున్నారు. ఇంట్లో ఉన్న సామానంతా సర్దేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాది క్రితం జరిగినా వరద విలయాన్ని తలుచుకుంటూ అల్లాడిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడిన పీడకలను తల్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. Jayashankar Bhupalpally Flood : ఈ తేదీ వస్తే గుర్తుకు వస్తే చాలు ఈ గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికీ వరద విలయాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఉగ్రరూపం దాల్చిన వాగులు ఊరిని ముంచెత్తిన దృశ్యాలు ఇంకా వారి కళ్లముందే మెదులుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా! అంటూ బయటపడిన ఆ ఆపత్కాలాన్ని తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. సరిగ్గా ఏడాద్రి క్రితం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని మోరంచ వాగు ముంచెత్తింది. పొలాలతో పచ్చగా ఉండే ఈ గ్రామం నామరూపాల్లేకుండా మారిపోయింది. గ్రామస్థులు ఇంటి పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాఫ్టర్ సాయంతో పలువురు ప్రాణాలు దక్కించుకున్నారు. అధికార యంత్రాంగం, సింగరేణి రెస్కూ బృందాలు బోట్ల సాయంతో గ్రామస్థులను రక్షించారు. కొందరు గ్రామస్థులే ధైర్యం చేసి ఇరుగు పొరుగు వారి ప్రాణాలు కాపాడారు.