One more interesting news on RRR movie story. Inspired from Bollywood movie
దర్శకధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రం కథ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రం ఓ బాలీవుడ్ చిత్రం స్పూర్తితో రూపొందుతోందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక ఆసక్తికరమైన చిత్రాలు రూపొందుతున్నాయి. కానీ అందరి చూపు మాత్రం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంపైనే ఉంది. అంతాలా ఈ చిత్రం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. బాహుబలి వంటి జానపద తరహా కథతో తెలుగు సినిమా సత్తాని రాజమౌళి ప్రపంచానికి చాటి చెప్పాడు. బాహుబలి తరువాత రూపొందిస్తున్న చిత్రం కావడంతో రాజమౌళి ఎలాంటి కథతో రాబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో అంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని రాంచరణ్ ఓ సందర్భంలో తెలియజేశాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన కరణ్ అర్జున్ చిత్రం తెలిసే ఉంటుంది. 1995 లోవచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలుచేసింది. రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది. ఈ చిత్రం ఆధారంగానే రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.