Bhargav, who is the son of Producer Gopal Reddy, his carcass was found at Nellore beach on Tuesday. #Bhargav #GopalReddy #Tollywood
ప్రముఖ దివంగత నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం కంబలి సముద్ర తీరంలో భార్గవ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భార్గవ్ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మృతిచెందాడా? లేక మరేదైనా కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 2008లొ గోపాల్ రెడ్డి మరణం తర్వాత ఆయన కటుంబ సభ్యులెవరూ ఇండస్ట్రీ వైపు రాలేదు. గతంలో బాలకృష్ణ హీరోగా గోపాల్ రెడ్డి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కొడుకు భార్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణల కాంబినేషన్ లో విజయవంతమైన చిత్రాలను నిర్మించారాయన. చెన్నైలో నివాసం ఉంటున్న భార్గవ్ కు నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో రొయ్యల హ్యాచరీ ఉంది. సోమవారం రాత్రి హాచరీ వద్దకు వచ్చిన భార్గవ్, రాత్రి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ కుక్క పిల్ల సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోతుండగా.. దాన్ని కాపాడేందుకు ప్రయత్నించి.. ఆయన కూడా సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టమ్ నివేదిక తర్వాత మృతికి సంబంధించి ఇంకేవైనా కారణాలున్నాయా? అన్నది తేలనుంది.