వెంట్రుకను ముడేసి కొండను లాగుతామని చెప్పండి చంద్రబాబు: ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

  • 6 years ago
Ex MP Undavalli Arun Kumar said people should not take money for vote in elections time

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే 2019 ఎన్నికలు చాలు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తారో.. వాడికి ఓటెయ్యొద్దని, డబ్బు ఖర్చు పెట్టినవాడు ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని అన్నారు. అలా అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించి టీడీపీ చెప్పిన తప్పుడు లెక్కలు కూడా ఏపీకి హోదా రాకుండా చేశాయని ఉండవల్లి పరోక్షంగా ఆరోపించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి అక్షరాలా 18 లక్షల 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారని గుర్తుచేశారు. ఇది దేశం మొత్తంలో వస్తున్న పెట్టుబడుల్లో 20 శాతం అని, ఇంతలా పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని, పన్ను రాయితీలు కావాలని ఎలా అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ చేయకపోగా.. ప్రతిపక్షం వల్లే తాము విఫలమయ్యామని చెప్పడం విడ్డూరం అని విమర్శించారు.
అసలు మనది ఫెడరల్‌ వ్యవస్థ కాదని, యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అని, అధికారమంతా కేంద్రం వద్దే ఉంటుందని ఉండవల్లి అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలన్నా, ఏదైనా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలన్నా అంతా వారి చేతిలోనే ఉందన్నారు. మనకు ఏ హక్కు ఉందని కేంద్రాన్ని హోదా కోసం డిమాండ్ చేస్తున్నాం? అని ప్రశ్నించారు. మాకు ఓటేయండి అని అడిగేటప్పుడు ప్రత్యేక హోదా ఇలా సాధిస్తామని ప్రజలకు వివరించండి అని పార్టీలకు ఆయన హితవు పలికారు. దానిపై ఏదో ఒకటి చెప్పాలని.. మా దగ్గర వెంట్రుక ఉందని, వెంట్రుకను ముడేసి కొండను లాగుతామని చెప్పండి చంద్రబాబు.. అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు కనీసం రెండు వేలు ఇవ్వాలని కొంతమంది చెబుతున్నారని, అందుకే ఏపీ బాగుపడాలంటే వచ్చే ఎన్నికలు చాలు అని ఉండవల్లి స్పష్టం చేశారు. మోసం రాజకీయ నాయకులు చేయగలరేమో గానీ పేదవాడు చేయలేడని అన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఈవీఎం బటన్ నొక్కే సమయంలో అంతరాత్మను మోసం చేసుకుని పేదవాడు ఓటు వేయలేడని ఆయన అన్నారు.