పవన్ ఆరడుగుల బుల్లెట్టు కాదట, బీజేపీ బుల్లెట్టు అంట !

  • 6 years ago
AP CM Chandrababu Naidu accusing that Janasena President Pawan Kalyan is creating all this nuisance in BJP direction

నిన్న మొన్నటిదాకా పవన్ ఏం మాట్లాడినా.. మనోడే అంటూ వెనకేసుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పవన్ వ్యాఖ్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే అతని బలహీనతలను బయటకు లాగాలని పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. పవన్ చేసిన అవినీతి ఆరోపణలు పార్టీకి బిగ్ డ్యామేజ్ చేశాయని ఆయన భావిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం.. వాటిని బీజేపీ సమర్థించడం.. చంద్రబాబుకు ఉన్న అనుమానాలను బలపరిచేదిగా మారింది. టీడీపీ బలహీనపరిచేందుకే పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పవన్ ముసుగు తొలగుతోందని.. ఆయన బీజేపీ సంధించిన బుల్లెట్టే అని టీడీపీ శ్రేణులకు ఒక అంచనాకు వస్తున్నాయి.
తాను చేసిన అవినీతి ఆరోపణలకు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నారు పవన్ కల్యాణ్. నిరాధారంగా తానేమి గాలి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతానని అంటున్నారు. అయితే ఆ సందర్భం ఎప్పుడు?.. అసలా సందర్భం వస్తుందా?.. లేక టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా కేవలం వారిపై బురద జల్లేందుకేనా ఇదంతా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలతో అటు బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ఆ పార్టీ లెక్కల్ని బయటతీసే పనిలో నిమగ్నమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగు పవన్ ముందు పడ్డాడు కాబట్టి.. ఆయన్ను అడ్డుపెట్టుకుని టీడీపీ లొసుగులన్ని బయటకు లాగాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనసేన, వైసీపీ, బీజేపీ.. ఈ మూడింటికి ఆ పార్టీ లక్ష్యంగా మారడంతో.. ఊపిరి సలపనంత ఇరకాటంలో పడ్డారు చంద్రబాబు. అయితే ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధమే అనేవారు లేకపోలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును వెనకేసుకొచ్చిన పవన్.. అకస్మాత్తుగా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారంటే.. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తీరు మారకపోవడం వల్లే ఆయన సహనం నశించిందని, అందుకే బహిరంగంగానే ఆరోపణలు చేశాడని అంటున్నారు.