India Vs South Africa 3rd T20 Preview
  • 6 years ago
India have never played T20 cricket at Newlands. This will be their first such outing, while South Africa have a less than impressive record here.

సఫారీ గడ్డపై కోహ్లీసేన పర్యటన తుది దశకు చేరుకుంది. మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టీ20తో సఫారీ గడ్డపై టీమిండియా తన పర్యటనను ముగించనుంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 కేప్‌టౌన్ వేదికగా శనివారం రాత్రి 9.30 గంటలకు జరగనుంది. గత బుధవారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో మూడు టీ20 సిరిస్ 1-1తో సమం అయింది.
ఈ టోర్నీ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ ఆఖరి మ్యాచా కావడంతో సిరిస్ ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో వరుస విజయాలను నమోదు చేసి భారీ అంచనాల మధ్య సఫారీ గడ్డపై భారత జట్టు గతేడాది డిసెంబర్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తొలుత జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను నెగ్గి సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అంతా భావించారు. అయితే, అభిమానుల అంచనాలను అందుకోవడంలో కోహ్లీసేన విఫలమైంది. తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలై మూడో టెస్టులో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. చివరి టెస్టులో నెగ్గిన అత్మవిశ్వాసంతో ఆరు వన్డేల సిరిస్‌ను ఏకంగా 5-1తో చేజిక్కించుకుని సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక, శనివారం జరిగే మూడో టీ20లో కూడా గెలిచి సఫారీ గడ్డపై విజయంతో ముగించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతుండగా... వన్డే సిరిస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి టీ20 సిరిస్‌లో బదులు తీర్చుకోవాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా వ్యూహాం రచిస్తోంది. అంతేకాదు సొంతగడ్డపై విజయంతో సిరీస్‌ని ముగించాలని ఆశిస్తోంది. మూడో టీ20 జరిగే కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 కూడా ఆడలేదు. మరోవైపు ఈ స్టేడియంలో ఆతిథ్య జట్టుకు టీ20ల్లో పేవలమైన రికార్డు ఉండటం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. ఈ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలైంది.
స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టి రెండో టీ20లో సఫారీలను ఒంటిచేత్తో గెలిపించిన క్లాసెన్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఇక, మూడో టీ20లో గెలుపు కోసం భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రెండో టీ20లో గాయం కారణంగా దూరమైన బుమ్రా మూడో టీ20లో తిరిగి చోటు దక్కించే అవకాశం ఉంది.
Recommended