భారత్‌తో రక్షణ బంధం మరింత బలోపేతం చేసిన అమెరికా

  • 6 years ago
భారత్‌తో రక్షణ బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అడుగులు ముందుకు వేసింది. ఇందులో భాగంగా 716 బిలియన్ అమెరికన్ డాలర్లతో కుదిరిన ఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రక్షణ విభాగంలో భారత్ తమకు ముఖ్యమైన దేశంగా అభివర్ణించిన అమెరికా... ఆ దేశం నుంచి అత్యాధునిక సాంకేతికత కలిగిన ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2019 బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతుగా 85 ఓట్లు రాగా 10 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. రక్షణ రంగంలో భారత్‌తో జతకట్టడమే కాకుండా టర్కీపై ఆంక్షలు కూడా ప్రతిపాదిస్తూ బిల్లులో పొందుపర్చింది. ఒకవేళ అమెరికా శతృదేశమైన రష్యా నుంచి టర్కీ ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేస్తే టర్కీపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది. టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రష్యా నుంచి కూడా అదే డిఫెన్స్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. మరోవైపు చైనా టెలికాం సంస్థ ZTE పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.