ఆ సింగర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
  • 6 years ago
A Patiala court on Friday convicted Daler Mehndi on charges of running an illegal immigration ring in 2003 and sentenced the Punjabi pop singer to two years in jail.

ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీకి శుక్రవారం పాటియాలా కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. 2003లో దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై ఈ మేరకు కేసు నమోదుకాగా, ఈ కేసులో కోర్టు శుక్రవారం తుదితీర్పు ప్రకటించింది.
తన మ్యూజికల్‌ ట్రూప్‌ విదేశాల్లో చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా దలేర్‌ మెహందీ, అతని సోదరుడు షంషేర్‌ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్‌, యూకే, కెనడాలతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్‌ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
1998, 1999 సంవత్సరాల్లో దలేర్ మెహందీ తన ట్రూప్‌తోపాటు మరో 10 మంది వ్యక్తులను విదేశాలకు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. వారిలో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. వారిని చట్టవిరుద్ధంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో వదిలేశారు. అలాగే మరో ముగ్గురు బాలురను కూడా ఇదే మాదిరిగా న్యూజెర్సీలో వదిలేశారు. దలేర్ అతడి తమ్ముడు వారి నుంచి డబ్బులు తీసుకుని చట్టవిరుద్ధంగా వారిని ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడ వదిలేసి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దలేర్ మెహందీ, అతడి సోదరుడిపై భక్షీస్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటియాలా పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు.
ఆ తరువాత దలేర్‌ మెహందీకి వ్యతిరేకంగా 35కుపైగా కేసులు నమోదు అయ్యాయి. పాటియాలా పోలీసులు అరెస్ట్‌ అనంతరం బెయిల్‌‌పై దలేర్‌ విడుదలైనప్పటికీ ఆయా కేసుల్లో ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే 2006లో పాటియాలా పోలీసులు దలేర్‌ మెహందీకి అనుకూలంగా.. రెండు డిశ్చార్జి పిటిషన్లు వేశారు. ఆయన అమాయకుడంటూ వారు పేర్కొన్నాకానీ కోర్టు ఒప్పుకోలేదు. ఆయనపై విచారణకు సరిపడా సాక్ష్యాలు ఉన్నాయంటూ పేర్కొంది. ఈ కేసులో తాజాగా పాటియాలా కోర్టు దలేర్‌ మెహందీని దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్‌ సింగ్ కూడా పాటియాలా కోర్టు కస్టడీలో ఉన్నారు.
Recommended