వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం: కారణమేంటో తెలుసా ?
  • 6 years ago
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కనిమెట్ట వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం తెల్లవారుజామునే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పంక్చర్ అయిన కారు ఎదురుగా వస్తున్న మరో కారును అతివేగంతో ఢీకొట్టినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో రెండు కార్లలో 11మంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో 8మంది మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన కారు నంబర్లు, 'TS 08 EQ 8108', 'TS 08 UA 3801'గా గుర్తించారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జవగా.. ఏడుగురి మృతదేహాలు వాహనాల్లోనే చిక్కుకుపోయాయి. ప్రస్తుతం వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కనిమెట్ట గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రమాదాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హైవేపై రద్దీని క్లియర్ చేయడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయి.

Recommended