దూసుకొచ్చిన టిప్పర్, 2వారాల్లో పెళ్లి యువతి మృతి

  • 7 years ago
A 21-year-old woman, who was to get married in less than two weeks, lost life on the spot while her fiance was injured in an mishap late last night at Kothapet here.

నగరంలోని సరూర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. మరో రెండు వారాల్లో పెళ్లి ఉండటంతో.. కాబోయే భర్తతో కలిసి పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చింది ఓ యువతి. కాగా, వారిద్దరూ బైక్‌పై వెళుతుండగా టిప్పర్‌ రూపంలో వచ్చిన మృత్యువు ఆ యువతిని బలితీసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన గీత(24) అదే ప్రాంతానికి చెందిన శబరీనాథ్‌(28)కి పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు వారు దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో షాపింగ్‌ చేశారు. ఇరుకుటుంబాల వారు కారులో వస్తుండగా గీత, శబరీనాథ్‌ మాత్రం బైక్‌పై బయలుదేరారు.
షాపింగ్‌మాల్‌ సమీపంలోనే యూటర్న్‌ తీసుకుంటుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న గీత కిందపడిపోయింది. ఆమె తలపై నుంచి టిప్పర్‌ వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. శబరీనాథ్‌ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెనకే కారులో అనుసరిస్తూ వస్తున్న కుటుంబసభ్యులు ఘటనను కళ్లారా చూసి హతాశులయ్యారు. గీత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్‌ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.